Banakacherla | పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై భారీగా అభ్యంతరాలున్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యనుల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. పర్యావరణ అనుమతుల కోసం సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని చెప్పింది. బనకచర్ల ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించి కమిటీ.. 1983లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ ప్రాజెక్టులో నీటి నిల్వపై కేంద్రంతో అధ్యయనం, ఏపీ-తెలంగాణలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు, పర్యావరణ ప్రభావంపై అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు జారీ చేయడం సాధ్యమవుతుందని కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు అనుమతుల కావాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సమీక్ష తప్పనిసరని తెలిపింది. ప్రాజెక్ట్ నివేదికలో లోపాలున్నాయని.. నీటి పంపకాల్లో జీడబ్ల్యూడీటీ తీర్పును ఉల్లంఘించేలా ఉన్నదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు మొదట డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించాలని, వారిచ్చే సూచనల ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది.
దీనిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, జీడబ్ల్యూదీటీ పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాటం విజయం.. తెలంగాణ విజయమన్నారు. బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టని.. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నామన్నారు.