అమరావతి : శరన్నవరాత్రోత్సవాల (Sharannavaratri Utsavalu) సందర్భంగా ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇంద్రకీలాద్రి (Indrakeeladri ), శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిలో తొలిరోజున దుర్గామాత బాలాత్రిపుర సుందరీదేవి (Balatripura Sundari Devi) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
నవరాత్రుల మొదటిరోజునే భక్తులు ఆలయాలకు వచ్చి భవానీ దీక్షలను ప్రారంభించారు. ఏపీ మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి(Minister Ramnarayana Reddy), పార్థసారధి (Parthasarathi) అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ సామాన్య భక్తులు సులువుగా దర్శనం చేసుకునేందుకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సుమారు 5 వేల మంది పోలీసులతో బందోబస్తు, 200 సీసీ కెమెరాల ఏర్పాటు, వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సమయం కేటాయింపు తదితర చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
నంద్యాల జిల్లాలోని శక్తిపీఠము జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైల (Srisailam) భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో దసరా (Dussehra) మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
గణపతిపూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో శ్రీభ్రమరాంబికా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఈవో పెద్దిరాజు తెలిపారు. వివిధ వాహనసేవలతో గ్రామోత్సవంగా శ్రీ స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగతిన దర్శనం పూర్తి చేసుకునే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు.