AP Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఒడిశాలోని పూరీకి 70 కిలోమీటర్లు, గోపాలపూర్‌కు 140కి.మీ., కళింగపట్నం(శ్రీకాకుళం)కు 240కి.మీ., దిఘా ( పశ్చిమ బెంగాల్)కు 290కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర, వాయవ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మధ్యాహ్నానికి ఉత్తర ఒడిశాలోని పూరీ-పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని డేగ అల మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 12 వరకూ మత్స్యకారులు సమద్రుంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
భారీ వర్షాల కారణంగా అల్లూరి జిల్లా జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న నలుగుర్ని అధికారులు రక్షించారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశంలో నివస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు.