అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని రాయచోటి దవాఖానకు తరలించారు.
ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారని చెప్పారు. మృతులను అంజినాయక్ (29), షేక్ అలీమ్ (32), జితేంద్ర (22), షేక్ అఫ్రోజ్ (30) గా గుర్తించారు. షేక్ ఖాదర్ బాషా (20) అనే యువకుడు గాయపడ్డాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వీరంతా కడప జిల్లాకు చెందినవారని తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మరో ప్రమాదంలో ముగ్గురు
మహబూబాబాద్: జిల్లాలోని దంతాలపల్లి శివారులో కారు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులను మల్లేశ్, కుమార్, నరేశ్‌గా గుర్తించారు. గాయపడినవారిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.