Scrub Typhus | ఏపీలో స్క్రబ్టైఫస్పై జరుగుతున్న ప్రచారంపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. స్క్రబ్టైఫస్ కొత్త వ్యాధి కాదని ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఇది కూడా డెంగీ, మలేరియాలాంటిదే అని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఈ కేసులు నమోదవుతూనే ఉంటాయన్నారు. ఈ ఏడాది 1566 కేసులు వచ్చాయని.. గత ఏడాది 1613 కేసులు వచ్చాయని తెలిపారు. స్క్రబ్టైఫస్ వల్ల వెంటనే మరణించరని పేర్కొన్నారు. ఇప్పటివరకు 9 మంది ఈ వ్యాధితో మరణించారని.. అయితే ఆ మరణాలకు ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే ఉన్న ఇతర వ్యాధులు, ఆలస్యంగా ఆస్పత్రికి రావడం వంటి కారణాల వల్ల వారు మరణించారని స్పష్టం చేశారు. స్క్రబ్టైఫస్తో వెంటనే మరణించరు కాబట్టి ఆందోళన అక్కర్లేదని ధైర్యం చెప్పారు.
అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్తో తగ్గించుకోవచ్చని వీరపాండ్యన్ తెలిపారు. ఈ మందులతో ఈ వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ స్క్రబ్టైఫస్కు చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. జ్వరం వచ్చిన ఐదో రోజు నుంచి 20వ రోజు మధ్యలో ఈ వ్యాధి బయటపడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. స్క్రబ్టైఫస్ వ్యాధి నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ శాఖలకు ప్రత్యేక అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేశామని, కలెక్టర్లు ప్రతివారం ఈ అంశంపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. IHIP పోర్టల్లో ప్రతి కేసు బాధ్యతగా అప్డేట్ చేయాలని సూచించారు. తెలంగాణలోనూ ఈ ఏడాది 183 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.