తిరుమల: తిరుమలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 68,354 మంది భక్తులు దర్శించుకోగా 24,159 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.59 కోట్లు వచ్చిందని వివరించారు.
టీటీడీకి రూ. 60 లక్షలు విరాళం
తెలంగాణకు చెందిన నితిన్ సాయి ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళంగా అందించింది. సంస్థ అధినేత, మాజీ శాసనసభ్యులు జి.సూర్యనారాయణ తరపున ఆయన కుమారుడు నితిన్ సాయి తిరుమలలో డోనార్ సెల్ ఇన్చార్జి డిప్యూటీ ఈవో సెల్వంకు విరాళం డీడీలను అందజేశారు.
ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, బర్డ్, సర్వశ్రేయ, పురాతన ఆలయాల పరిరక్షణ ట్రస్టు, కాటేజీ నిర్మాణం కోసం రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు, ప్రచారం చేసేందుకు టీటీడీ చేస్తున్న కృషిని దాత కొనియాడారు.