AP News | కౌంటింగ్ సమయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు జూమ్ మీటింగ్‌లో జరుగుతున్న శిక్షణాతరగతుల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తులని విమర్శించారు. కౌంటింగ్ సమయంలో ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు కాబట్టి మనవాళ్లు ఎక్కడ సమయమనం కోల్పోవద్దని సూచించారు.
ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని.. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని వైసీపీ శ్రేణులకు సజ్జల సూచించారు. ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌పై కొత్త నిబంధన పెట్టారని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లపై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ దెబ్బతీసేలా వ్యవహరిస్తారని.. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఎగ్జిట్ పోల్స్‌లో జాతీయ సర్వేలు పొంతన లేని అంకెలు ఇచ్చాయని సజ్జల అభిప్రాయపడ్డారు. లోకల్ సర్వేలను చూస్తే ట్రెండ్ ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. ఎన్నికల్లో కచ్చితంగా మనమే గెలుస్తున్నామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.