అమరావతి : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) ప్రవేశపెట్టిన బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project ) నిధులు కేటాయింపును ప్రస్తావించారు. పోలవరానికి రూ. 12,157.53 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం 2025-26 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
దాదాపు గంట 15 నిమిషాల పాటు కొనసాగిన బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రాజెక్టులపై నిధుల కేటాయింపును వెల్లడించారు. ఇందులో భాగంగా గతంలో ప్రకటించిన విధంగా పోలవరానికి నిధుల కేటాయింపును బడ్జెట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మధ్య నుంచి వెళ్లే గోదావరి నదిపై బహుళార్ధక ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు గత కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ హోదాను కల్పించింది.
గత దశాబ్దకాలంగా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. దీంతో కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో రాష్ట్రకూటమి కీలకంగా మారింది. గత ఏడు నెలలుగా కేంద్రం రాష్ట్రానికి ఆపన్నహస్తం అందిస్తూ వస్తుంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ (Visaka Steel Plant) పునరుద్ధరణకు రూ. 11,440 కోట్లను కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించింది.