అమరావతి : వైసీపీ హయాంలో రోడ్లు ( Roads ) నరకానికి రహదారులుగా మారాయని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) అన్నారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో శనివారం రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గత పాలకుడు రాష్ట్రానికి ప్రమాదకరమైన గుంతలు పెట్టారని గడిచిన ఐదేండ్లలో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చుచేశారని పేర్కొన్నారు. రోడ్లు నాగరికతకు చిహ్నమని అన్నారు. మెరుగైన రోడ్లు ఉంటే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చేందుకు 860 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. సంక్రాంతిలోపు (Sankranthi) రోడ్లపై గుంతలన్నీ పూడ్చాలని అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నంలో రైల్వేజోన్‌కు (Railway Zone) వైసీపీ ప్రభుత్వం భూమిని ఇవ్వలేకపోయారని విమర్శించారు. వైసీపీ దోచుకోవడం తప్పా అభివృద్ధిపై దృష్టిని సారించలేదని పేర్కొన్నారు. సంపాద సృష్టించాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. రోడ్లతో పాటు రైల్వే లైన్లు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాబోయే 5 సంవత్సరాల్లో 72 వేల కోట్లతో రైల్వేలైన్లు, స్టేషన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. బుల్లెట్ ట్రైన్‌కు నాంది పలుకుతున్నామని, రైల్వే లైన్ కోసం భూసేకరణ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా కేంద్రానికి ఇస్తున్నామని వెల్లడించారు.