Srisailam | నంద్యాల జిల్లా పరిధిలో ఉద్యోగమ నియామకాలు, పదోన్నతులు, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల అమలుతీరును, అమలవుతున్న సంక్షేమ పథకాల అమలుతీరుపై జాతీయ కమిషన్ కార్యదర్శి జీ శ్రీనివాస్ సమీక్షించారు. దేవస్థాన కార్యాలయంలోని సమీక్షా సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్, నంద్యాల జాయింట్ కలెక్టర్ సీ విష్ణుచరణ్, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి డీ నాగజ్యోతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి పాల్గొన్నారు.
సమావేశానికి దేవస్థానం యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఆయా విభాగాల సిబ్బంది హాజరయ్యారు. మొదట దేవస్థానం శ్రీశైలక్షేత్ర విశేషాలను, క్షేత్ర ప్రత్యేకతలను, దేవస్థానంలో జరిగే ప్రధాన ఉత్సవాలైన మహాశివరాత్రి, ఉగాది, దసరా మహోత్సవాలను, దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న ఆయా సౌకర్యాలను వివరించారు. దేవస్థానంలో 148 మంది షెడ్యూల్డ్ కులాల సిబ్బంది పని చేస్తున్నారని.. అందులో శాశ్వత ఉద్యోగ సిబ్బంది 32 మంది, ఒప్పంద సిబ్బంది 50 మంది, పొరుగుసేవల సిబ్బంది 66 మంది ఉన్నారన్నారు. శాశ్వత సిబ్బందిలో ఇద్దరు సహాయ ఈవోలు, ముగ్గురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది రికార్డు అసిస్టెంట్లు, 14 మంది నాల్గో తరగతి సిబ్బంది ఉన్నారని తెలిపారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవస్థానంలోని ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో అమలు పరుస్తున్న రిజర్వేషన్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
దేవస్థానానికి సంబంధించిన చారిత్రక శాసవాలను, విశేషాలను తామ్రశాసనాలను ప్రతి ఒక్క భక్తుడు చూసేందుకు వీలుగా మ్యూజియం ఏర్పాటు చేయడానికి తాను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో షెడ్యూల్డ్ సామాజికవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పథకాలపై నంద్యాల జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థల వారితో సమీక్షించారు. అనంతరం అటెండర్ స్థాయి నుంచి రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన జేవీ నరసింహులు, ఈ మధుసూదన్, బీ చిన్న, సీమెచ్ విమల, వై జ్యోతి, కే రాధమ్మకి కార్యదర్శి పదోన్నతి పత్రాలను అందించారు.