అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ (Land and Titling Act ) ను రద్దు చేస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించిందని మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra Babu) అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అనేక సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఈ చట్టాన్ని బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలే అమలు చేయలేదని పేర్కొన్నారు . గత వైసీపీ (YCP) ప్రభుత్వం ఎవరితో చర్చించకుండానే చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. నీతిఅయోగ్ ( Niti Aayog) ప్రతిపాదిత చట్టానికి, గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి సంబంధం లేదని వివరించారు. ఈ చట్టం వివాదాలను పెంచే విధంగా ఉందని, ప్రజలకు మేలు చేసేదిగా లేదని అన్నారు.
రెవెన్యూ (Revenue) , రిజిస్ట్రేషన్, ల్యాండ్ రికార్డ్సు వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుకపై కమిటీ వేసి పర్యవేక్షణ చేయడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ఇసుకపై గత ప్రభుత్వం కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. పాత ఇసుక విధానం, పలు ఒప్పందాలు రద్దు చేశామని తెలిపారు.