Chandrababu | కొత్త ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నామని స్పష్టం చేశారు.
అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమని చెప్పారు. డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని తెలిపారు. నదుల్లో పూడిక, బోట్ సొసైటీ ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక దొరుకుతుందని వివరించారు.
ఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పంటలబీమా పథకం అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసగించిందని తెలిపారు. కాకినాడలో ద్వారంపూడి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చించామన్నారు. కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలన్నారు. శాఖల సంబంధిత అంశాలపై మంత్రులు ప్రతినెలా సమీక్ష చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలన్నారు. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలన్నారు.