అమరావతి : నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు (MP Raghuramaraj) కు హైకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని రఘురామరాజు హైకోర్టు (High Court ) లో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని పిటీషన్లో పేర్కొన్నారు.
శుక్రవారం పిటిషన్పై విచారణ జరుగగా పిటిషనర్ తరుఫున న్యాయవాదులు రవిప్రసాద్, ఉమేశ్ చంద్ర తమ వాదనలు వినిపించారు. అనంతరం హైకోర్టు 41 -ఎ నిబంధనలు పాటిస్తూ ఎంపీకి రక్షణ కల్పించాలని ఆదేశించింది . ఆర్నేష్ కుమార్ (Arnesh Kumar case) కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని, పోలీసులు రఘురామకృష్ణరాజుపై నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది .
రఘురామరాజు వైసీపీ నుంచి గెలిచినప్పటికీ అనంతరం సీఎం వైఎస్ జగన్తో భేదాభిప్రాయాలు రావడంతో పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ విధానాలను, వైఎస్ జగన్ తీరును బాహటంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో అతడిపై కేసులు నమోదు చేశారు. విచారణ పేరిట సీఐడీ అధికారులు వేధింపులకు గురిచేయడంతో అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు.