AP News: అంతర్గతపోరుతో అట్టుడుకుతున్న నేపాల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన వారు చిక్కుకుపోయారు. విహారయాత్ర నిమిత్తం రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వ్యక్తులు కాఠ్మండూ వెళ్లారు. అయితే ప్రభుత్వంపై యువత తిరుగబడటంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన గురివిరెడ్డి, ఆయన భార్య, బద్వేలుకు చెందిన ఇద్దరు, నంద్యాలకు చెందిన ఇద్దరు, కర్నూలుకు చెందిన 48 మంది అక్కడే ఉండిపోయారు. పశుపతి ఆలయానికి సమీపంలోని ఓ హోటల్లో గత మూడు రోజులుగా బస చేస్తున్నారు.
హెచ్ఆర్38ఏఏ4871 నంబర్ బస్సులో వారంతా నేపాల్ పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తమకు భద్రత కల్పించి, సరిహద్దు దాటించాలని కోరుతున్నారు. కాగా, నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్ జెడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్లైన్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ సభ్యులు ప్రతిపాదించినట్లు వార్తలు రాగా, ఆమె అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదరలేద ని మరో గ్రూపు నిరసనకారులు గురువారం వెల్లడించారు. నేపాల్ విద్యుత్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కుల్మన్ ఘీషింగ్ పేరును తాత్కాలిక ప్రభుత్వ సారథిగా వారు ప్రతిపాదించారు.