హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తేతెలంగాణ) : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఉదయం సూర్యప్రభ వాహనసేవతో ప్రారంభంకానున్న వేడుకలు, రాత్రి చంద్రప్రభ వాహనసేవతో ముగియనున్నట్టు వెల్లడించారు.
ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనసేవ, 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనసేవ, 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనసేవ, ఒంటిగంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనసేవ, 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనసేవ, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనసేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ నిర్వహించనున్నట్టు వివరించారు. రథసప్తమి వేడుకల దృష్ట్యా మంగళవారం ఆర్జితసేవలను రద్దు చేసినట్టు ఈఓ శ్యామలరావు వెల్లడించారు.