Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు శుద్ధజలాలను మాత్రమే సరఫరా చేయాలని దేవస్థానం ఈవో లవన్న సిబ్బందికి సూచనలు చేశారు. బుధవారం ఆయన క్షేత్ర పరిధిలో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రధాన కూడళ్లలో గల మంచినీటి శుద్దీకరణ కేంద్రాలకు అవసరమైన మరమ్మతులు చేయించాలని చెప్పారు.
గంగాభవానీ స్నానాలగట్టు, పాతాళగంగ ప్రాంతాలను పర్యటించడంతోపాటు గోశాలను సందర్శించి ఆవులకు ఈవో లవన్న టీకాలు వేయించారు. గోసంరక్షణ కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.
శ్రీశైల మహాక్షేత్రం అత్యంత మహిమాన్విత క్షేత్రమని గురుమాత శ్రీయోగినిమాత పేర్కొన్నారు. శ్రీగిరిపై చేసే అభిషేక హోమాలు యఙ్ఞాలు శుభఫలితాలనిస్తాయని అన్నారు. బుధవారం ఆశ్రమంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్త్ర లింగార్చన, చండీహోమం, సుదర్శనహోమం, స్వామి అమ్మవార్లకు కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధిక సంఖ్యలో భక్తులు హాజరై తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా విశ్వహిందూ పరిషత్ శ్రీశైల మండల అధ్యక్షులు జీవీ నారాయణ, ప్రధాన కార్యదర్శి కాశయ్య, ఉపాధ్యక్షులు నాగరాజు, హనుమంతరావు, లక్ష్మీనారాయణతోపాటు నిరంజన్స్వామి, రాముస్వామి, రాజుస్వామి, నర్సింహస్వామి, అరుణ్, శ్రీను, సతీష్, వెంకట్ పాల్గొన్నారు.