అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణానికి తీసుకొచ్చిన వన్‌టైం సెటిల్మెంట్(ఓటీఎస్) పథకానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో టీడీపీ, సీపీఎం శ్రేణులు నిరసనలు చేపట్టాయి. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాయి. అనంతరం పటమట తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పన్నుల భారాలతో ప్రజలను దోచుకుంటున్నారన్నారని ఆరోపించారు. జగన్ పరిపాలన తుగ్లక్ చర్యలకు మించి సాగుతోందని విమర్శించారు.
టీడీపీ హయాంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున బడుగు, బలహీన వర్గాలకు ఇండ్లను కట్టించామని తెలిపారు. కేంద్రం సహకారంతో కట్టిన ఇళ్లకు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను డబ్బులు కట్టాలని కోరడం వింతగా ఉందని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తహసీల్ కార్యాలయం వద్ద టీడీపీ, సీపీఎంల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మెడలో ఉరి తాళ్లు వేసుకుని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.