అమరావతి : సినీ నిర్మాత బండ్ల గణేష్ ( Bandla Ganesh ) రేపటి నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహించనున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandra Babu ) ను అరెస్టు చేసి జైలులో పెట్టిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసు ( Skill Development Case ) లో నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబును 50 రోజుల పాటు జైలులో పెట్టారు .
ఇటీవల స్కిల్ డెవలప్మెంట్కు చెందిన కేసును కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు జైలు నుంచి క్షేమంగా బయటకు వస్తే తిరుమలకు కాలినడకన వస్తానని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. తాను మొక్కుకున్న ప్రకారం సోమవారం ఉదయం 9 గంటలకు షాద్‌నగర్‌లోని నివాసం నుంచి సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను ప్రారంభించనున్నట్లు గణేష్ ప్రకటించారు.
వైసీపీ హయాంలో ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్‌లో 2014లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను ఏర్పాటు చేశారు.
ఇందుకోసం సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మొత్తం 3,356 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులో సీమెన్స్ వాటా 90 శాతం, మిగతా పది శాతం ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. ఇందులో రూ. 371 కోట్ల నిధులు దారి మళ్లాయన్న ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఇప్పుడు ఈ కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐడీ స్పష్టం చేస్తూ ఏపీ సీఐడీ (CID) న్యాయస్థానానికి నివేదిక సమర్పించడంతో కోర్టు కేసును కొట్టివేసింది .