అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను( Medical College) ప్రైవేటీకరణకు పూనుకొని పేదలకు వైద్యం అందకుండా కుట్ర చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి మీడియాతో మాట్లాడారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే స్టేజీకి తీసుకొచ్చామని గుర్తు చేశారు.
ఆధునిక దేవాలయాలైన మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే పేదవాడికి వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. అమరావతికి రూ.2లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ. 5వేల కోట్లు ఖర్చు పెట్టలేరా అంటూ నిలదీశారు. నర్సీపట్నం ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యనపాత్రుడు చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.