అమరావతి : కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలను ( Medical College) ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) ఆరోపించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పేదలకు మంచి వైద్యం అందించడానికే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని తెలిపారు.
ప్రభుత్వ వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చామని, ఐఏఎస్ అధికారులను ప్రభుత్వ ఆస్పత్రులకు ఇన్ఛార్జ్లుగా నియమించామని స్పష్టం చేశారు. కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కొన్నాం వివరించారు. కూటమి పాలనలో పేదలకు వైద్యం దూరమవుతుందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వాల బాధ్యతని, మెరుగైన వైద్యం పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు.
పేద, మద్య తరగతి కుటుంబాల్లో ఒకరికి ఆరోగ్యం పాడైనా అప్పుల పాలుకావల్సిందేనని అన్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పేదల కోసమేనని పేర్కొన్నారు . వైద్య రంగంలో వైఎస్ జగన్ చేసిన సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందేనని,పలాస కిడ్నీ ఆసుపత్రి, రిసెర్చ్ సెంటర్ ఇందుకు నిదర్శనమని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం మార్చుకోవాలని సూచించారు.