Bus Accident | పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న భారీ వాటర్ పైప్‌లైన్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు ఒక పక్కకు ఒరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలోకి రాగానే అదుపు తప్పింది. వెంటనే రోడ్డు పక్కనే ఉన్న భారీ వాటర్ పైప్‌లైన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం, ముఖ్యంగా డ్రైవర్ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్, కిటికీల నుంచి బయటకు దూకేశారు. దీంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
బస్సు యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. కాగా, డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందా? సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద అదుపుతప్పి గుంటలోకి దూసుకెళ్లిన బస్సు
ఎమర్జెన్సీ డోర్ ద్వారా సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం pic.twitter.com/YPDBd42KuX
— BIG TV Breaking News (@bigtvtelugu) November 10, 2025