అమరావతి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu) ఈనెల 17న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. గుంటూరులోని మంగళగిరి ఎయిమ్స్ వైద్యకళాశాల ( AIIMS) స్నాతకోత్సవానికి ఆమె రానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిమ్స్‌లో సంబంధిత వైద్యాధికారులతో పాటు నగరపాలక, రెవెన్యూ ( Revenue ) తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
రాష్ట్రపతి మంగళగిరికి (Mangalagiri) చేరుకుని ఎయిమ్స్‌లోకి వచ్చే మార్గం, తిరిగి వెళ్లే మార్గంలో అధికారికంగా చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను సంబంధిత అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రపతి పాల్గొనే సదస్సు ప్రధాన ఆడిటోరియాన్ని పరిశీలించి కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు . కార్యక్రమానికి అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ఈడీలను ముందుగానే ఏర్పాటే చేసి వాటి పనితీరును సరి చూసుకోవాలని ఆదేశించారు. వీఐపీలు, అధికారులు, ప్రముఖుల వాహన పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు.