తిరుమల : తిరుమల లో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavam) టీటీడీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంధి సన్నద్ధం కావాలని టీటీడీ అదనపు ఈవో(Additional EO) వెంకయ్య చౌదరి(Venkaiah Chaudhary ) ఆదేశించారు.
శనివారం తిరుమల ( Tirumala ) లోని అన్నమయ్య భవన్లో ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, లడ్డూ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం భద్రతా ఏర్పాట్లపై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, 8న గరుడసేవ(Garuda Seva) , 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం ఏర్పాట్లపై చర్చించారు.
బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవాలు ఉంటాయని వివరించారు. గరుడ సేవ కోసం యాత్రికుల పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, అక్టోబర్ 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు కొండపైకి ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, శిశువులు ఉన్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు, అన్ని ఆర్జిత సేవలు, రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.