హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. గత ఎన్నికల్లో వైకాపాకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ శనివారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. శనివారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టుకు పీకే చేరుకున్నారు. అక్కడి నుంచి నారా లోకేశ్‌తో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ బాబుతో సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.
జగన్ ప్రభుత్వ పనితీరు, పాలనపై చర్చించినట్టు సమాచారం. సమావేశం అనంతరం బయటకు వచ్చిన పీకేను విలేకరులు ప్రశ్నించగా.. చంద్రబాబు సీనియర్ నేత అని, అందుకే మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. తమ భేటీపై ఎలాంటి ఊహాగాలు వద్దని కూడా చెప్పడం గమనార్హం. మరోవైపు బాబు, పీకే భేటీపై వైకాపా నేతలు స్పందించారు. మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో పీకేను తిట్టిన బాబు, లోకేశ్ ఇప్పడు ఏం మొఖం పెట్టుకొని ఆయనను కలిశారంటూ నిలదీశారు. మెటీరియల్ చెడ్డదైతే మేస్త్రీ ఏం చేస్తారంటూ అంబటి సెటైరికల్ ట్విట్ చేశారు.