Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ ఆరోపించింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదాన్ని చేశారని ఆక్షేపించారు. 2017, 2018లో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించకముందు.. ఆ వరద ప్రభావం డయాఫ్రమ్ వాల్‌పై పడకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోలేదని.. దాంతోనే కోతకు గురై దెబ్బతిందని సీడబ్ల్యూసీకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందజేసిందని తెలిపింది.
గాడి తప్పిన పోలవరం పనులను 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం చక్కదిద్దిందని వైసీపీ తెలిపింది. 2020లో ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తిస్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందని వివరించింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసిందని పేర్కొంది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉందని స్పష్టం చేసింది. వైసీపీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది.
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం నిర్మించిన డయాఫ్రమ్‌వాల్‌కు ఎగువన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది. ఇందుకు రెండు ప్రతిపాదనలను తన నివేదికలో చర్చించింది. ఒకే సీజన్లో పనికి అంతరాయం లేకుండా పూర్తి చేయడం లేదా ప్రధాన డ్యామ్ పని ఒక స్థాయి వరకు పూర్తి చేసుకుని, ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మించడం.. ఇలా చేస్తే వానకాలంలోనూ డయాఫ్రమ్ వాల్ నిర్మించుకోవచ్చని ఆ నివేదికలో అభిప్రాయపడింది. కాగా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టు సంస్థ మేఘాకే అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం చర్చించి ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.