Perni Nani | విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పండగే పండగ అని డైలాగులు కొడుతున్నారని తెలిపారు. రూ.15వేలతో ఏం పండుగ చేసుకోవాలని ప్రశ్నించారు. మంగళగిరిలోని వైసీపీ కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడుతూ.. అసలు ఈ పథకాన్ని ప్రారంభించినదే వైఎస్ జగన్ అని గుర్తుచేశారు.
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో పండుగ చేసుకోండి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారని పేర్ని నాని గుర్తుచేశారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు వేశామని గప్పాలు కొడుతున్నారని మండిపడ్డారు. రూ.15వేలతో ఏ పండుగ చేసుకోవాలని నిలదీశారు. ఆటోకు పెండింగ్ చలానాలు ఉంటే డబ్బులివ్వారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అందరికీ వేస్తామని చెప్పి.. ఇప్పుడు కొందరికే వేస్తారా అని నిలదీశారు.
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారని పేర్ని నాని విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదని అంటున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్లకు కూటమి నేతలు ఎన్నో హామీలిచ్చారని.. ఇప్పుడు వాటన్నింటికీ చేతులెత్తేశారని అన్నారు.