హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీలోకి వరుస చేరికలతో ఆంధ్రప్రదేశ్ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నది. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రితోపాటు పలువురు మైనారిటీ నాయకులు బీఆర్ఎస్లో చేరిన రెండు రోజులకే నెల్లూరు జిల్లా నుంచి వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన పలువురు గులాబీగూటికి చేరారు. విజయవాడలో పలు పార్టీల నేతలతో, వివిధ సామాజికవర్గాల ముఖ్యులతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమావేశమైన మరుసటి రోజే విజయవాడ మాజీ మేయర్ గులాబీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయటానికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆసక్తిని చూపుతున్నారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన క్రిస్టియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ షర్మిల సంపత్, ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నాయకురాలు మీనా కుమారితోపాటు వివిధ పార్టీలకు చెందిన సూర్యప్రకాష్, పాపయ్య, ప్రసాద్, ప్రశాంత్, మహేందర్, అర్జున్ కొడాలి సహా పలువురు నేతలు శనివారం హైదరాబాద్‌లోని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరింప చేస్తాం. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ సంచలనం సృష్టించబోతున్నది. బీఆర్ఎస్ పట్ల ఏపీ ప్రజల్లో సానుకూలమైన వాతావరణం నెలకొన్నది. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ రోజురోజుకు కుంచించుకోపోయింది. బీజేపీ పట్ల, మోదీ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్నది. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని ప్రజలు తీర్మానించుకున్నారు.
– బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్