Deputy CM | డిప్యూటీ సీఎం పదవిపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీలో ఇప్పుడు పవన్ కల్యాణ్ ఒక్కడే డిప్యూటీ సీఎంగా ఉండగా.. టీడీపీ నుంచి నారా లోకేశ్‌కు కూడా ఆ పదవి కట్టబెట్టాలని తెలుగు తమ్ముళ్ల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది. ఈ క్రమంలో జనసేన నేత కిశోర్ గునుకుల కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అనే పదానికి వన్నె తెచ్చింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కరే అని ఆయన వ్యాఖ్యానించారు. పెద్దలు ఈ విషయాన్ని గమనించాలని కూడా సూచించారు.
గతంలో చాలామంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారని నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిశోర్ గునుకుల తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం నిర్వహించిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కిశోర్ మాట్లాడుతూ.. గతంలో ఎవరెవరు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారో తనతో పాటు చాలామందికి తెలియదని అన్నారు. కానీ ఈరోజున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి యావత్ దేశం చర్చిస్తోందని చెప్పుకొచ్చారు. వామన రూపంలో వచ్చి శ్రీమహావిష్ణువు ఇంతింతై వటుడింతై అని ఎదిగినట్లుగా పవన్ కల్యాణ్ ఎదుగుతున్నారని అన్నారు.
డిప్యూటి సీఎం అనే పదానికి వన్నె తెచ్చారు మా @PawanKalyan
గారు.. అంతేగాని #PawanKalyan గారికి డిప్యూటీ సీఎం పదవి వల్ల ప్రత్యేక చరిష్మా రాలే..పెద్దలు గమనించాలి.
గత లో #DeputyCM లుగా ఎవరున్నారో చాలామందికి తెలియదు. @APDeputyCMO@JanaSenaParty#KishoreGunukula #DeputyCMPawanKalyan pic.twitter.com/8uabqJYSyi— 𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 (@GunukulaKishore) January 20, 2025
పల్లెలు అభివృద్ధి చెందాలంటే పల్లె నుంచి నగరానికి కనెక్టివిటీ రోడ్లు ఉండాలని ఆరోజు ప్రశ్నించిన గొంతుక పవన్ కల్యాణ్ అని కిశోర్ గునుకుల అన్నారు. ఈ రోజు పల్లెలకే కాదు.. తండాలకు సైతం రోడ్లు వేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆరోజు నినాదించిన స్వరం.. ఈ రోజు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడిందని పేర్కొన్నారు.