Pawan Kalyan | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా మారి, కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్‌తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై పవన్ కల్యాణ్ చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తుపాన్‌పై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలి. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి” అని స్పష్టం చేశారు.
ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల రైతులు, ప్రజలకి సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వెళ్లేందుకు పవన్ కల్యాణ్ సిద్ధం కాగా, ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని, ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు.