తిరుపతి : తిరుపతిలోని వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు రేపటి నుంచి 4వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనున్నదని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 3న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నామని తెలిపారు.
4న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరుపనున్నట్లు వివరించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారని పేర్కొన్నారు.
దంపతులురూ.300 చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని చెప్పారు. మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయని వివరించారు.