ap news | పురుగు కుట్టిందనే భయంతో ఆస్పత్రికి వెళ్లే మహిళ ప్రాణం పోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మహిళ.. ఊపిరాడక ఇబ్బంది పడుతూ ప్రాణాలు విడిచింది. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పేదనెమలిపురి గ్రామానికి చెందిన అంకాల భూలక్ష్మి శుక్రవారం ఇంట్లో బట్టలు ఉతుకుతుండగా ఏదో కుట్టినట్లు అనిపించింది. నొప్పిగా ఉండటంతో ఏదో విష పురుగు కుట్టి ఉంటుందనే అనుమానంతో చికిత్స కోసం కుటుంబసభ్యులతో కలిసి పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స అనంతరం ఇంటికి పంపించేశారు. శనివారం రోజు భూలక్ష్మి తనకు తలనొప్పిగా ఉందని చెప్పడంతో పిడుగురాళ్లలోని విజయ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకుంది. కానీ ఆదివారం సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి పరిస్థితి విషమించడంతో భూలక్ష్మి మృతిచెందింది.
ఆగ్రహంతో నర్సింగ్ హోమ్ అద్దాలు పగులకొట్టిన బాధితురాలి బంధువులు
అయితే, ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే భూలక్ష్మి మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆమె ఆరోగ్యంగానే ఉందని, అందరితో మాట్లాడుతూ ఉందని తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం సమయంలో కాంపౌండర్ వచ్చి ఏదో ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఊపిరాడక ఇబ్బంది పడిందని.. ఆ వెంటనే మరణించిందని పేర్కొన్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా భూలక్ష్మి మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఆస్పత్రి నుంచి మెల్లిగా జారుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన మృతురాలి బంధువులు ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.