పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. గంగుపల్లి తండాకు చెందిన చిన్నా నాయక్‌కు అదే గ్రామానికి చెందిన బుజ్జి బాయితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బుజ్జి బాయి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి కాపురానికి రావడంలేదు. దీంతో పెద్దలతో కలిసి రాజీ కుదిర్చేందుకు చిన్నా నాయక్ పలుమార్లు యత్నించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.
మరోవైపు పిల్లలు తల్లి గురించి తరచూ అడగడంతో చిన్నా నాయక్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఒక్కడే చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించినా చిన్నా నాయక్.. వారి ప్రాణాలను కూడా తీయాలని భావించాడు. ఈ క్రమంలోనే కూల్ డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించాడు. తాను కూడా అదే తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.