Vijayawada | పాకిస్థాన్ పేరుతో మన దేశంలో ఒక కాలనీ ఉందని తెలుసా! అది కూడా ఎక్కడో నార్త్ ఇండియాలోనో.. ఈశాన్య భారతదేశంలోనో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే!! ఏపీలోని విజయవాడలోనే ఈ కాలనీ ఉంది. దీనికి 40 ఏండ్ల చరిత్ర కూడా ఉంది. ఈ విషయం తెలిసి ఇప్పుడు ఇలాగే ఆశ్చర్యపోతున్నారు. అసలు విజయవాడలోని ఓ కాలనీకి పాకిస్థాన్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకీ ఇక్కడ ఉండేది పాకిస్థాన్ వాళ్లా? లేదా మన భారతీయులేనా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. దీని తర్వాత పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించింది. అప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయి. లక్షలాది మంది శరణార్థులు తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) నుంచి భారత్‌కు వచ్చారు. నిరాశ్రయులైన ప్రజల కోసం అప్పటి భారత ప్రభుత్వం అండగా నిలిచింది. శరణార్థుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలోనే 1984లో విజయవాడలోని పాయకాపురం సమీపంలో ఒక కాలనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1986 నాటికి 40 ఇళ్లతో కూడిన ఓ చిన్న కాలనీని నిర్మించింది. దానికి పాకిస్థాన్ కాలనీగా నామకరణం చేసింది.
తూర్పు పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా శిబిరాలు ఏర్పాటు చేశారు. దీంతో సరిహద్దుల నుంచి ఏపీలోని విజయవాడ వరకు ఇంత దూరం ఎవరూ రాలేదు. అయితే పలు కుటుంబాలు వచ్చినప్పటికీ ఇక్కడ కొంతకాలమే ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో పాయకాపురం విజయవాడకు శివారు ప్రాంతం. చుట్టూ ఇండ్లు ఉండేవి కాదు. సరైన రోడ్లు, కరెంటు లేదు. వర్షాకాలం వస్తే మొత్తం బురదగా ఉండేది. దీంతో వచ్చిన అడపాదడపా కుటుంబాలు కూడా తిరిగి వెళ్లిపోయాయి. అలా పాకిస్థాన్ కాలనీ మొత్తం నిర్మానుష్యంగా మిగిలిపోయింది.
ఇదిలా ఉంటే మూడు దశాబ్దాల క్రితం పాయకాపురం ప్రాంతాన్ని బుడమేరు వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో చుట్టపక్కల చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అయితే పాకిస్థాన్ కాలనీ మిగిలిన ప్రాంతాల కంటే ఎత్తులో ఉండేది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరదలకు నష్టపోయిన కుటుంబాలను ఇక్కడికి తరలించారు. అలా వచ్చిన ప్రజలు అక్కడే స్థిరపడిపోయారు.
అప్పుడు 40 కుటుంబాలతో ఏర్పడిన ఈ కాలనీలో ప్రస్తుతం 58 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 2012లో అప్పటి సీఎం వైఎస్ఆర్ 8 మందికి రిజిస్ట్రేషన్‌తో కూడిన ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆ తర్వాత చంద్రబాబు సర్కార్ 32 మందికి బీఫాం పట్టాలు మంజూరు చేసింది. ఇప్పటికీ 17 ఇళ్లకు ఎటువంటి పట్టాలు లేవు. దీంతో తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ పాకిస్థాన్ కాలనీ అన్న పేరే ఇప్పుడు ఆ కాలనీవాసులకు చిక్కులు తెచ్చిపెడుతుంది. ఇతర దేశాలకు వెళ్లాలన్నా, ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలన్నా పాకిస్థాన్ కాలనీ పేరు చూసి రిజెక్ట్ చేస్తున్నారని వాపోతున్నారు. ఇలా చాలామంది ఉపాధిని కోల్పోయారని వాపోతున్నారు. ఈ క్రమంలోనే తమ కాలనీని భగీరథ కాలనీగా మార్చాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.