హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఈ నెల 18న జరిగిన మావోయిస్టు కీలక నేత హిడ్మా సహా పలువురి ఎన్‌కౌంటర్‌పై ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల నిజనిర్ధారణ పర్యటన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను చింతూరు పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.. విద్యార్థుల అరెస్ట్‌ను ఖండించారు. ప్రపంచంలో ఎకడ అన్యాయం జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్పందిస్తూనే ఉంటారని గుర్తుచేశారు.
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ చేయనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ డీజీపీకి విద్యార్థులు ముందుగానే లేఖలు రాశారని చెప్పారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కోసం వెళ్తే అరెస్ట్‌కు పాల్పడటం దారుణమన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.