Srisailam | పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం నాడు ఊయల సేవ ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి శుక్రవారం నాడు, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవ నిర్వహించబడుతుంది. ఈ సేవలో భాగంగా లక్ష కుంకుమార్చన తర్వాత ఈ ఊయల సేవ జరిపించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపిస్తారు. ఆ తర్వాత ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపిస్తారు. చివరగా ఊయల సేవ నిర్వహిస్తారు. ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చన జరిపిస్తారు.
శ్రీశైలం అమ్మవారికి ముందుగా లక్ష కుంకుమార్చన జరిపించనున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు పరోక్ష సేవ రూపంలో ఈ పూజలు జరిపించుకుంటున్నారు. ఈ రోజు మొత్తం 19 మంది భక్తులు పరోక్ష సేవగా ఈ కుంకుమార్చన జరిపించుకున్నారు. కాగా లక్ష కుంకుమార్చనలో ముందుగా పూజా సంకల్పం పఠించబడుతుంది. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించనున్నారు. అనంతరం లక్ష కుంకుమార్చన జరిపించనున్నారు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కాగా శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జిత పరోక్ష సేవను నిర్వహిస్తోంది. ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవా రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులుసేవా రుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 లను సంప్రదించాలని ఈవో సూచించారు.
ఈ సేవలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం కూడా నిర్వహించనున్నారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడుతుంది. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడుతాయి.
పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదయాబద్ధంగా నిర్వహించనున్నది. ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం నుంచి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంటుంది. అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంటుంది. హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్ధిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంటుంది. రుద్రవనం నుంచి నందిమండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.
శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణానంతరం శ్రీస్వామివార్లదర్శనం కల్పించబడుతోంది.