Srisailam | శ్రీశైల మహా క్షేత్రం పరిధిలో తిరుగుతున్న ఆటో ట్యాక్సీల డ్రైవర్లు.. స్థానికులు, భక్తుల నుంచి నిర్దేశిత ఆటో చార్జీలు మాత్రమే వసూలు చేయాలని శ్రీశైల ధర్మ కర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి సూచించారు. శనివారం శ్రీశైలం దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో ఆటో ట్యాక్సీ డ్రైవర్ల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు మాట్లాడుతూ భక్తులతో మర్యాదగా మెలగాలని హితవు చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి వేగ పరిమితి పాటించాలని అన్నారు. శ్రీశైలం సీఐ దివాకర్ రెడ్డి, ఎస్ ఐ జీ లక్ష్మణ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు గతంతో నిర్దేశించిన ఆటో చార్జీలు మాత్రమే వసూలు చేయాలన్నారు.
స్థానికంగా ఒక్కొక్కరికి లోకల్ లింక్ సర్వీస్ రూ.20, సైట్ సీయింగ్ కోసం (సాక్షి గణపతి ఆలయం, హటకేశ్వరం ఆలయం, ఫాలధార -పంచదార, శిఖరేశ్వరం) అప్ డౌన్ చార్జీలు రూ. 100, శ్రీశైలం-శ్రీశైలం ప్రాజెక్టు వరకు రూ.100, శ్రీశైలం లింగాల గట్టుకు అప్ డౌన్ చార్జీలు రూ.120 మాత్రమే ఉండాలని పెద్దిరాజు స్పష్టం చేశారు. ఆటో చార్జీలు పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని చెప్పారు. ఈ రేట్ల పట్టికల స్టిక్కర్లు కూడా దేవస్థానమే అందజేస్తుందన్నారు.