హైదరాబాద్ : ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ( Online Cricket Betting) ఆడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 43,57,461ను స్వాధీనం చేసుకుని ముఠా సభ్యులను అరెస్టు చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులకు అందిన పక్క సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు మియాపూర్ పీఎస్ పరిధిలోని మాతృశ్రీ నగర్‌లోని శ్రీనిధ సర్వీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 505 పై దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారివద్ద నుంచి రూ. 40 లక్షల నగదు (Cash), ల్యాప్ టాప్స్(Laptops), టాప్స్, మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన నర్సారావు పేట కు చెందిన శాకమూరి వెంకటేశ్వర్ రావు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు వివరించారు. ఇతని వద్ద నలుగురు బూకీలు (Bookies) గా పనిచేస్తూ క్రికెట్ లైవ్ గురు , లక్కీ ఆన్లైన్ యాప్. కాల్ కాన్ఫరెన్స్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని వెల్లడించారు. దాదాపు 50 మంది వరకు పంటర్స్ ఆన్లైన్ బెట్టింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. బెట్టింగ్ కొరకు వివిధ బ్యాంకు లకు చెందిన ఐదు ఖాతాలను ఉపయోగించారని, వీటిని ఫ్రీజ్ చేసి అందులో ఉన్న రూ. 3,57,461 లను స్తంభింపజేశామన్నారు. ఆలూరు త్రినాథ్, మనం రాజేష్, బొల్లె స్వామి , మార్పెన్న గణపతిరావు, శాకమూరి వెంకటేశ్వర్ రావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.