అమరావతి : మచిలిపట్నం ప్రైవేట్ గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని( Perninani ) సతీమణి జయసుధకు (Jayasudha) పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. నిన్న రాత్రి పోలీసులు పేర్నినాని ఇంటికి వెళ్లగా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసు (Police Notice) అంటించి వెళ్లిపోయారు.
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బందరులోని ఆర్.పేట పోలీష్స్టేషన్కు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. బెయిల్ మంజూరు సందర్భంగా పోలీసుల విచారణకు సహకరించాలని జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని విచారించి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
నిన్న పేర్నినానిపై ఏ- 6 నిందితుడని పోలీసులు తాజాగా కేసు నమోదు చేయగా ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్లో పేర్నినాని ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. పరిశీలించిన కోర్టు ఈ కేసులో నానిపై వచ్చే సోమవారం ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.