Chandrababu | సంక్రాంతి పండుగ వేళ దారుణం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నివాసం ముందు ఓ వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా తన స్వగ్రామమైన నారావారిపల్లెకు వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాకతో తన సమస్యలను చెప్పుకునేందుకు చిత్తూరు జిల్లా రాజయ్యగారిపల్లెకు చెందిన గోవిందరెడ్డి (65) అనే వృద్ధుడు నారావారిపల్లెకు వచ్చాడు. కానీ చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన వృద్ధుడి ముందు అక్కడి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
చంద్రబాబును వృద్ధుడు కలిసేందుకు నిరాకరించడంతో పాటు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో మనస్తాపానికి గురైన గోవిందరెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని నారావారిపల్లెలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.