OG Review | హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ లుక్స్, సుజీత్ టేకింగ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో రేపు (గురువారం) విడుదల కానున్న ఓజీ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఈ సినిమాపై తన తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో పంచుకున్నాడు.
నాకున్న పరిజ్ఞానం మేరకు పవన్ కల్యాణ్ ఓజీ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నానని అంబటి రాంబాబు తెలిపారు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే.. పవన్ కల్యాణ్ ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు బ్రో, హరిహరవీరమల్లు అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి. అందువల్ల ఓజీ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని పవన్ కల్యాణ్ కసిగా పనిచేసి ఉంటారని తన అభిప్రాయమని తెలిపారు. అలాగే డైరెక్టర్ గత రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. కాబట్టి ఈ చిత్రాన్ని హిట్ చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉంటాడని పేర్కొన్నారు. ఇక మూడోది ఈ చిత్ర నిర్మాత దానయ్య అని అన్నారు. ఈ చిత్రం హిట్ కొట్టాలని దానయ్య ఖర్చుకు వెనుకాడలేదని తెలిపారు. ఇన్ని పట్టుదలల మధ్య నిర్మించిన ఈ చిత్రం కొంత మెరుగైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఆ నమ్మకంతో ఓజీ కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.
‘ హరిహర వీరమల్లు చిత్రం హడావుడిగా తీశారు. అనుకున్న స్థాయిలో గ్రాఫిక్స్ చేయలేకపోయారు. చివరకు ఈ సినిమా విడుదలైతే చాలు అన్న పరిస్థితుల్లో షూటింగ్ జరిగింది. ఓజీ విషయానికొస్తే పవన్ కల్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతల్ని కూడా పక్కనబెట్టి తీసిన సినిమా. అందువల్ల కచ్చితంగా విజయవంతం కావాలని నా కోరిక’ అని అంబటి రాంబాబు తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమాలు విజయవంతం కావాలని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదని అన్నారు. రాజకీయంగా ఆయన మాకు ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తుంటామని.. అవి కూడా సద్విమర్శలే అని చెప్పారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ వీడియో రిలీజ్ చేశారు.
మరోవైపు ట్విట్టర్ (ఎక్స్) వేదికగానూ ఓజీ సినిమాపై అంబటి రాంబాబు స్పందించారు. పవన్ జీ.. ఓజీ సూపర్ డూపర్ హిట్టయ్యి.. దానయ్యకు దండిగా ధనం రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
పవన్ జి… “OG”
సూపర్ డూపర్ హిట్టై
దానయ్యకు దండిగా ధనం
రావాలని కోరుకుంటున్నాను !@DVVMovies @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2025