Perni Nani | వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సవాలు విసిరారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి పేర్ని నాని హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించామని తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. జగన్ నిలదీస్తారని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ సౌకర్యాలు అడగడం లేదని.. ప్రతిపక్ష హోదా మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తే చేయండి.. ప్రజలకు తప్ప జగన్ ఎవరికీ లొంగరని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుంటే డిస్క్వాలిఫై చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా అని నిలదీశారు. అసెంబ్లీని ఏకపక్షంగా నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలన ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీదే గెలుపని స్పష్టం చేశారు. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కాగా, నారా లోకేశ్ రెడ్ బుక్ తరహాలోనే వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను లాంఛ్ చేశారు. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలు ఇందులో ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చారు. ఈ మేరకు https://digitalbook.weysrcp.com/ వెబ్‌సైట్‌ను లాంఛ్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. https://digitalbook.weysrcp.com/ వెబ్సైట్లో మొబైల్ నంబర్‌తో లాగిన అయ్యి.. ఎలాంటి అన్యాయం జరిగిన సరే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌తో పాటు ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. 040-49171718 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ లైబ్రరీలో నమోదు చేసి భద్రపరుస్తారు. ఈ డిజిటల్ బుక్కు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్‌ను కూడా వైఎస్ జగన్ లాంచ్ చేశారు. వెబ్సైట్లోకి వెళ్లి సమస్యలపై ఫిర్యాదు చేయలేని వాళ్లు.. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ సమస్యలకు సంబంధించిన వీడియో అప్లోడ్ చేయవచ్చు.