ECI : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లుగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు పంజాబ్ (Punjab) లో ఒక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.
అయితే జమ్ముకశ్మీర్లో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు మూడు వేర్వేరు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ నాలుగు రాజ్యసభ స్థానాలు మూడు వేర్వేరు ద్వైవార్షిక సైకిళ్లలో ఉన్నాయని, కాబట్టి చట్టప్రకారం ఆ నాలుగు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ‘ఏకే వాలియా vs భారత ప్రభుత్వం (1994)’ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది.
ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు వేర్వేరు కేటగిరీలకు సంబంధించినవై ఉన్నప్పుడు ఆయా స్థానాలకు ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించాలని నాడు ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. జమ్ముకశ్మీర్లో రెండు రాజ్యసభ స్థానాలు 2021 ఫిబ్రవరి 15న ఖాళీ కాగా, మరో రెండు స్థానాలు 2021 ఫిబ్రవరి 10 కంటే ముందు ఖాళీ అయ్యాయి. ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా తన పదవికి రాజీనామా చేసి రాష్ట్ర క్యాబినెట్లో చేరడంతో పంజాబ్లో ఒక స్థానం ఖాళీ అయ్యింది.
ఈ ఐదు స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.