Stray Dogs | ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలోని 250 వీధికుక్కలకు పంచాయతీ కార్యదర్శి విషమిచ్చి హతమార్చాడు. డిసెంబర్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలగలూరు మండలంతో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉండేది. అయితే రెండు మూడు రోజులుగా వీధికుక్కలు అస్సలు కనిపించడం లేదు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కుక్కలు కనిపించడం లేదని తెలిసిన జంతు సంరక్షణ ప్రతినిధులు.. ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది. దాదాపు 250 వీధికుక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది విషపూరితమైన ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశారని.. అనంతరం ఎవరికీ తెలియకుండా వాటిని గ్రామ శివారులో గుంతలు తీసి పాతిపెట్టినట్లుగా తెలుసుకున్నారు.
ఈ దారుణానికి సంబంధించిన ఆధారాలను సేకరించిన రత్న జంతుసేవా సంస్థ ప్రతినిధులు వెంటనే వెలగలేరు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.