JEE Main 2025 | జేఈఈ పరీక్షా కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. జనవరి 22 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లను చూసి ఏపీకి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బిత్తరపోతున్నారు. దీనికి కారణం జేఈఈ మెయిన్స్ పేపర్ 1 పరీక్షకు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో సెంటర్ కేటాయించగా.. పేపర్ 2 పరీక్షకు వైజాగ్‌ను అలాట్ చేశారు. ఈ రెండు సిటీల మధ్య 2800కి పైగా కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కరోజులో ఇంతదూరం ప్రయాణించి పరీక్ష ఎలా రాస్తామని సదరు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే)ను సంప్రదించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థులు కే. తేజచరణ్, పి.సాయిలోకేశ్లు జేఈఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఇటీవల తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. అయితే అందులో తమ పరీక్షా కేంద్రాలను చూసుకుని తేజచరణ్, సాయి లోకేశ్ ఇద్దరూ అవాక్కయ్యారు. జేఈఈ పేపర్ 1, జేఈఈ పేపర్ 2కు సంబంధించి రెండు వేర్వేరు సెంటర్లు కేటాయించడమే ఇందుకు కారణం.
వేర్వేరు పరీక్షా కేంద్రాలను కేటాయిస్తే ఎందుకు అంతలా షాకవ్వడమని అనుకోవచ్చు. అయితే ఆ రెండు సెంటర్ల మధ్య దాదాపు 2800కి పైగా కిలోమీటర్ల దూరం ఉండటం గమనార్హం. జనవరి 29న జరిగే పేపర్ (బీటెక్)కు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు.ఆ మరుసటి రోజు జనవరి 30న జరిగే పేపర్ 2(బీఆర్క్)కు వైజాగ్‌ను కేటాయించారు. దీంతో షాకైన విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్టీయేను సంప్రదించారు. కానీ వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఇష్టారీతిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్టీయే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.