తిరుమల : తిరుమలలో (Tirumala) శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ రాజకీయ ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ( Recommendation letters) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలు నిరాధారమని కొట్టిపారేశారు.
తెలంగాణ (Telangana) ప్రజాప్రతినిధుల దర్శన అభ్యర్థనల కోసం వారానికి రెండు రోజులు సిఫార్సు లేఖలను స్వీకరించడానికి టీటీడీ అంగీకరించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండించారు. ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
టీటీడీకి రూ.5 లక్షల సేంద్రియ ఎరువులు విరాళం
తిరుపతి : తిరుపతికి చెందిన క్రియాజన్ అగ్రీ అండ్ బయోటెక్ కంపెనీ టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న అటవీ , ఉద్యానవన సంరక్షణ కోసం రూ. 5 లక్షల విలువ గల 20 టన్నుల సేంద్రియ ఎరువులను విరాళంగా అందించింది.సేంద్రియ ఎరువులను ఉప అటవీ సంరక్షణ అధికారి శ్రీనివాస్‌కు తిరుపతిలోని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య చేతుల మీదుగా తిరుపతి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మనోహర్ బాబు, అగ్రికల్చరల్ ఆఫీసర్ ప్రపూర్ణ, కంపెనీ సిబ్బంది జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అందజేశారు.