Dharmavaram | శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్థాన్‌కు తరచూ ఫోన్ కాల్స్ చేస్తున్నాడని, అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అతని కదలికలు గుర్తించిన ఐబీ, ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ధర్మవరంలోని ఓ బిర్యానీ పాయింట్లో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి వంట మనిషిగా పనిచేస్తున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. నూర్ నుంచి 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డుల ద్వారా నూర్ ఎవరితో సంప్రదింపులు జరిపాడు అనే దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రితమే నూర్‌ను అదుపులోకి తీసుకుని, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.
జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూప్‌ల్లో నూర్ మెంబర్‌గా ఉన్నాడని.. అందులోని నంబర్లకు అతని నుంచి కాల్స్ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు చేశాడని నిఘా సంస్థలు గుర్తించినట్లు తెలిసింది.