అత్తారింటి వేధింపులకు పెళ్లయిన ఐదు నెలలకే నవ వధువు బలైంది. అందంగా లేవని భర్త తిడుతూ కొడుతూ ఉంటే.. అడ్డుచెప్పాల్సిన అత్తామామలు కూడా వేధించడంతో తీవ్ర మనోవేదనకు గురై ఉరివేసుకుంది. ఈ క్రమంలో తన భర్త చేసే అరాచకాలను చెబుతూ ఆమె రాసిన లేఖ ఇప్పుడు అందర్నీ కంటతడిపెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన నాగరాజు, శివనందేశ్వరమ్మల కుమార్తె శ్రీవిద్య ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఓ ప్రైవేటు కాలేజీలోని లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్ 23న కంకిపాడు మండలం కుందేరుకు చెందిన అరుణ్‌కుమార్‌తో వివాహమైంది. అరుణ్‌కుమార్ కలవపాములలో సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వీరికి పెళ్లయినప్పటి నుంచి అత్తారింట్లో శ్రీవిద్యకు వేధింపులకు గురవుతున్నది. ఈ క్రమంలో ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. తన భర్త తరచూ దాడి చేసి వేధిస్తున్నాడని.. భరించలేకపోతున్నానని శ్రీవిద్య సూసైడ్ నోట్ రాసింది.
Srividya1
‘ అమ్మా నాకు ఇంకా బతకాలని లేదు. వీడు తాగొచ్చి ప్రతిసారి కొడుతున్నాడు. ఆ సాయి అనే అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అందం ముందు నేను పనికిరాను అంటూ, ఆ అమ్మాయి గుర్తొస్తుంది అంటున్నాడు. తాగొచ్చి మంచం కేసి తంతూ కొట్టాడు. జుట్టు పట్టుకుని గట్టిగట్టిగా కొడుతున్నాడు. అమ్మా తలంతా నొప్పిగా ఉంది. వీపు మీద గట్టిగట్టిగా గుద్దుతున్నాడు. నా డ్రెస్ కూడా చింపేశాడు. అసలు నేను ఏం చేశాను అమ్మా. మంచిగా ఉండటం కూడా నా తప్పు అయిపోయింది. కానీ ఇలాంటి వాడి దగ్గర ఉండలేకపోతున్నాను. మన ఇంటికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. వీడిని మాత్రం వదలద్దు. వీడి అమ్మానాన్నని మాత్రం వదలద్దు. ‘ అని శ్రీవిద్య తన సూసైడ్ నోట్లో రాసింది.
‘ నాన్న జాగ్రత్త.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే చదువుకునే టైమ్‌లో పొగరుగా ఉండేదాన్ని. అరే తమ్ముడు జాగ్రత్తరా.. నేను రాఖీ కట్టకపోవచ్చేమో.. అమ్మానాన్నని జాగ్రత్తగా చూసుకో’ అని ఆ లేఖలో రాసింది. ఆ సూసైడ్ నోట్ ఇప్పుడు అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. కాగా, ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో తమను వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది.. ఇంటికి వెళ్లేసరికి తన కుమార్తె శవమై కనిపించిందని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.