Digital Ration Cards | ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్లతో డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
కొత్త రేషన్‌కార్డులపై రాజకీయ నేతల ఫొటోలు ఉండవని నాదెండ్ల మనోహర్ తెలిపారు. డెబిట్ కార్డు తరహాలో ఈ కార్డులు ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా 9 లక్షల మందికిపైగా అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రలోని 29,796 రేషన్ షాపుల్లో ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. 25 నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదని స్పష్టం చేశారు.