అమరావతి : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) బాధితులను ఆదుకోవడానికి దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) లిమిటెడ్ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. కోటి చొప్పున విరాళాలను ప్రకటించారు. ఈ విరాళాలను ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి పంపనున్నట్లు ఆమె ఎక్స్వేదిక ద్వారా ప్రకటించారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభినందించారు. ఈ కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు.