AP News | బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్‌నకు గురవ్వడం కలకలం రేపింది. ఉద్యోగరీత్యా బ్యాంకాక్‌కు వెళ్లిన మధుకుమార్‌ను కొంతమంది దుండగులు అపహరించారు. అనంతరం అతని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రూ.8లక్షలు డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన మధు కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా ఈ నెల 24న బెంగళూరు నుంచి అతను బ్యాంకాక్ వెళ్లాడు. ఆ తర్వాత ఈ నెల 25న మధు కుమార్ మొబైల్ నుంచి తన అక్క రాజ్యలక్ష్మి ఓ మెసేజ్ వచ్చింది. తనను కొంతమంది కిడ్నాప్ చేశారని, రూ.8 లక్షలు ఇస్తే వదులుతామని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వచ్చిన ఆ మెసేజ్ చూసి రాజ్యలక్ష్మీ కంగారుపడింది. వెంటనే మధుకుమార్‌కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో భయపడిపోయిన మధుకుమార్ తల్లిదండ్రులు డోన్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు.
బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్ అయ్యాడని వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మధు పనిచేస్తున్న కంపెనీలోనూ పోలీసులు విచారిస్తున్నారు. నిజంగానే మధుకుమార్ బ్యాంకాక్ వెళ్లాడా? లేదా? అన్న వివరాలను ఎయిర్‌పోర్టులో అధికారులను కోరారు. వాళ్లిచ్చే సమాచారం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అలాగే సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.